kollywood: టీడీఎస్ చెల్లించని నటుడు విశాల్.. నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

  • సిబ్బంది వేతనాల టీడీఎస్ చెల్లించని విశాల్
  • నిన్నటి విచారణకు హాజరుకాని నటుడు
  • విచారణను 28కి వాయిదా వేసిన కోర్టు
కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్)ను సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయింది. టీడీఎస్ సక్రమంగా చెల్లించకపోవడంతో గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు విశాల్‌కు నోటీసులు పంపారు.ఆ నోటీసులపై విశాల్ స్పందించకపోవడంతో  ఎగ్మూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరు కావాలంటూ విశాల్‌ను ఆదేశించింది. అయినప్పటికీ నిన్నటి విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న విశాల్ తరపు న్యాయవాదుల అభ్యర్థనను ఐటీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనల అనంతరం విశాల్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.  
kollywood
actor vishal
arrest
TDS
court

More Telugu News