Twins: అవిభక్త కవలలను విజయవంతంగా వేరు చేసిన హంగేరీ డాక్టర్లు

  • దాదాపు 30 గంటల పాటు శ్రమించిన డాక్టర్ల బృందం
  • డాక్టర్ ఆద్రాస్ సోకే నేతృత్వంలో శ్రమించిన 35 మంది వైద్యులు
  • ప్రస్తుతం కోలుకుంటున్న చిన్నారులు

తెలుగు రాష్ట్రాల్లో వీణా-వాణి గురించి తెలియనివాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. శరీరాలు అతుక్కుని జన్మించిన వాళ్లను విడదీయడం డాక్టర్ల శక్తికి మించిన పనైంది. అయితే, బంగ్లాదేశ్ లో తలలు అతుక్కుపోయి జన్మించిన ఇద్దరు అవిభక్త కవలలను హంగేరీ డాక్టర్లు విజయవంతంగా విడదీశారు. బంగ్లాదేశ్ కు చెందిన రబేయా, రుఖయా మూడేళ్ల వయసున్న కవలలు. 5 నుంచి 6 మిలియన్లలో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన ఎంబ్రియోలాజికల్ లోపంతో బంగ్లా కవలలు జన్మించారు.

వీరికి ఆపరేషన్ చేసేందుకు హంగేరీ డాక్టర్ల బృందం ముందుకు వచ్చింది. అయితే, శస్త్రచికిత్స చేస్తే సక్సెస్ శాతం సగమేనని డాక్టర్లు ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులకు ముందే స్పష్టం చేశారు. బతికే అవకాశాలు 50 శాతమే ఉంటాయని వివరించారు. ప్రఖ్యాత న్యూరో సర్జన్ ఆద్రాస్ సోకే నేతృత్వంలో 35 మంది నిపుణులైన డాక్టర్లు దాదాపు 30 గంటల పాటు శ్రమించి రబేయా, రుఖయాలను విడదీశారు. ప్రస్తుతం ఈ కవలలు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్స సందర్భంగా వీరి పుర్రె, మెదడు భాగాలను విడదీసి, హంగేరీలో ప్రత్యేక పరిస్థితుల మధ్య అభివృద్ధి చేసిన ఆ చిన్నారుల కణజాలంతో ఖాళీ భాగాలను భర్తీ చేశారు. కాగా, రబేయా, రుఖయాల పరిస్థితి గురించి తెలుసుకున్న ఏడీపీఎఫ్ (యాక్షన్ ఫర్ డిఫెన్స్ లెస్ పీపుల్ ఫౌండేషన్) ఆపరేషన్ కు సాయం చేసింది.

More Telugu News