polavaram: స్వలాభం కోసమే ‘పోలవరం’ పంచాయతీ: మాజీ మంత్రి దేవినేని ఉమ

  • జగన్‌మోహన్‌ రెడ్డిది పులివెందుల న్యాయం
  • ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నిబంధనల మేరకే నవయుగకు పనులు

తెలుగు వారి కల అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలి నుంచీ దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టకేలకు పులివెందుల పంచాయతీ ద్వారా పనులు అడ్డుకునే ప్రయత్నానికి తెర తీశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఫైనల్ ఎకౌంటు సెటిల్‌ చేసుకునేందుకే ఈ పంచాయతీ అన్నారు. పోలవరం టెండర్లపై ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.

పోలవరం వద్ద వరద ఉద్ధృతిని అంచనా వేస్తున్న సమయంలో 15 రోజుల్లో అకౌంట్ సెటిల్ చేసుకోమనడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏదో జరిగిపోయిందని  ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా  చేశారు.  కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా పనుల కాంట్రాక్టును రద్దు చేయడం ఏమిటన్నారు. అకారణంగా పనులు నిలిపివేశారని ఆరోపించారు.

77 శాతానికి పైగా పనులు టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ట్రాన్స్ ట్రాయ్ నుంచి నిబంధనలకు అనుగుణంగా నవయుగకు పనులు అప్పగించామని వెల్లడించారు. కేంద్ర జలవనరుల శాఖ, నిపుణులు, ఇంజనీర్లు పర్యవేక్షణలో పోలవరం కట్టామన్నారు. అటువంటిది అవినీతి పేరుతో ఎటువంటి నోటీసులు లేకుండా  పనులు ఎలా ఆపేస్తారని  ప్రశ్నించారు. మట్టి పనులు తన వారికి కట్టబెట్టేందుకు, విద్యుత్ ప్రాజెక్టు చేజిక్కించుకోవడానికే ఈ కుయుక్తులని ధ్వజమెత్తారు.

More Telugu News