బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేసిందనే విషయం ముందే ఊహించా: కుమారస్వామి

31-07-2019 Wed 12:42
  • ఫిబ్రవరిలోనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నించింది
  • కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు కూడా బీజేపీకి కలిసొచ్చాయి
  • మా పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పోతారనే విషయం కూడా నాకు తెలుసు
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీనిపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పలు విషయాలను వెల్లడించారు. తమ ప్రభుత్వం కూలిపోతుందనే విషయాన్ని తాను ముందే ఊహించానని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే బీజేపీ తమని టార్గెట్ చేసిందని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని విస్తరించే పనిలో ఉంటే... బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉందని మండిపడ్డారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నించిందని కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉండటం కూడా బీజేపీకి కలిసొచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చుతుందనే విషయాన్ని ముందే ఊహించాను కాబట్టే... ఈ విషయం తనకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదని తెలిపారు. తమ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పోతారనే విషయం కూడా తనకు ముందే తెలుసని చెప్పారు. తానే వారికి సమస్య అని కొందరు అసమ్మతి ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారని... అసలు వారి సమస్య ఏమిటో తెలిస్తే కదా దానికి కారణం తానో, కాదో తెలిసేదని అన్నారు. వాళ్లెవరూ తనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడలేదని చెప్పారు.