హలో... సన్నీలియోన్ ఉన్నారా!... సినిమాలో చెప్పిన ఫోన్‌ నంబర్‌కి రోజుకి 150 కాల్స్‌

31-07-2019 Wed 10:14
  • ‘అర్జున్‌పటియాలా’ చిత్రంలోని ఓ సన్నివేశంలో చెప్పిన నంబర్‌
  • నిజంగా ఆమెదే నంబర్‌ అనుకుని వరుస కాల్స్‌
  • అది  ఢిల్లీకి చెందిన ఓ యువకుడి పర్సనల్ నంబర్‌

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అంటే ఇదేమరి. ఒకప్పటి పోర్న్‌స్టార్‌, ప్రస్తుత బాలీవుడ్‌ తార సన్నీలియోన్ సినిమా సన్నివేశంలో చెప్పిన ఫోన్‌ నంబర్‌, ఆ నంబర్‌ అసలు యజమానికి చుక్కలు చూపిస్తోంది. అది నిజంగా సన్నిలియోన్‌ ఫోన్‌ నంబర్‌ అనుకుని వందలాది మంది అభిమానులు రోజూ చేస్తున్న ఫోన్లతో అతను తలపట్టుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళితే...బాలీవుడ్‌ నటులు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో ‘అర్జున్‌ పటియాలా’చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26న విడుదలై మంచి టాక్‌తో నడుస్తున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ అతిథి పాత్రలో,  ప్రత్యేక సాంగ్ లో కనిపించారు. ఓ సన్నివేశంలో సన్నీలియోన్ తన ఫోన్‌ నంబర్‌ను దిల్జీత్‌కు ఇస్తారు. దర్శక, నిర్మాతలు అలవోకగా చెప్పించిన ఈ నంబర్ ను ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్‌ అగర్వాల్‌ ఉపయోగిస్తున్నాడు.

నిజంగానే అది సన్నీలియోన్ నంబర్‌ అని భావించిన అభిమానులు వరుసగా కాల్స్‌ చేస్తుండడంతో ఇదెక్కడ గొడవని పునీత్ తలపట్టుకుంటున్నాడు. కొందరు ఫోన్ చేసి వీడియో కాల్‌ చేయాలంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పునీత్‌ మీడియా ముందు వాపోయాడు. రోజుకు 150 వరకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, దీనివల్ల తాను మానసికంగా  హింస అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

అందుకే ఇందుకు బాధ్యులైన  ‘అర్జున్‌ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు వేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాధారణంగా సినిమాలో  ఫోన్ నంబరు చెప్పాల్సివస్తే ఉపయోగంలో లేని నంబరు వాడుతారు. కానీ ఈ నంబరు ఓ వ్యక్తి పర్సనల్ కావడంతో సమస్యలు ఎదురయ్యాయి. బాధితుడి హెచ్చరికపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.