Rajya Sabha: 'మీ మార్గంలోనే మేము'... అంటూ గులాం నబీ ఆజాద్ కు దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బీజేపీ!

  • నిన్న రాజ్యసభలో తలాక్ బిల్లు
  • ముస్లిం కుటుంబాలను కూల్చడమే ఉద్దేశమన్న గులాం నబీ
  • నాడు కాంగ్రెస్ ఏం చేసిందో వివరించిన రవిశంకర్

నిన్న రాజ్యసభలో ముస్లిం వ్యవస్థలోని ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తూ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చి లక్షలాది మంది ముస్లిం మహిళలకు అండగా నిలువనుంది. ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన వేళ, కాంగ్రెస్ పార్టీ తరఫున గులాంనబీ ఆజాద్, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గట్టిగానే ప్రయత్నించారు. అయితే, ఆయనకు దిమ్మతిరిగే సమాధానాన్ని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇచ్చారు.

తలాక్ బిల్లుపై మాట్లాడిన గులాం నబీ ఆజాద్, "ఇది ముస్లిం మహిళల పరిరక్షణ బిల్లు అంటున్నారు. కానీ, ముస్లిం కుటుంబాలను కూల్చడమే దీని అసలు ఉద్దేశం. ఓ కుటుంబాన్ని కూల్చాలంటే ఇంట్లోని దంపతుల నుంచే కూల్చాలన్నట్టుగా బిల్లును తయారు చేశారు. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తే, మూడేళ్ల జైలు శిక్ష విధించాలని చెప్పారు. భార్య, పిల్లలను ఈ విషయంలో మరచిపోయారు. ఒకవేళ భర్తకు జైలు శిక్ష పడితే, అతని భార్యకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా? వీరి పిల్లలను చదివిస్తుందా? కానీ, ప్రభుత్వం ఆర్థిక చేయూత ఉండదని అంటోంది. కానీ భర్తను మాత్రం జైలుకు పంపేందుకు వారు ఉత్సాహంగా ఉన్నారు. ఇటువంటి చట్టాన్ని నేను ఇంతవరకూ చూడలేదు" అని ఆగ్రహంగా అన్నారు.

దీనికి ఘాటైన సమాధానం ఇచ్చిన రవిశంకర్ ప్రసాద్, ఈ ఆందోళనను తోసిపుచ్చుతూ, హిందూ వివాహ చట్టం ప్రకారం కూడా పలు నేరాలకు జైలు శిక్షలు ఉన్నాయని అన్నారు.  "తమ పార్టీ చేసిన మంచి పనిని గులాం నబీ మరచిపోయారు. 1955లో హిందూ వివాహ చట్టాన్ని తయారు చేసినప్పుడు తప్పనిసరిగా భర్త వయసు 21 ఏళ్లు, భార్య వయసు 18 ఏళ్లు ఉండాలన్నారు. బాగుంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని సెక్షన్ 18లో పేర్కొన్నారు.

గులాం నబీ ఆజాద్ గారూ, దీన్ని మీ పార్టీయే తీసుకువచ్చింది. మరి ఆ సమయంలో భర్త జైలుకు వెళితే, భార్య గతేంటని మీరు ప్రశ్నించలేదు. భార్య జీవితం గందరగోళం అవుతుందని అనలేదు. భార్య ఉండగా ఇంకో భార్యను లేదా భర్త ఉండగా ఇంకో భర్తను తీసుకురావడం చట్ట విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల క్రితమే, ఇటువంటి నేరాలకు ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ చట్టం తెచ్చింది. దీన్ని మరచిన గులాం నబీ, ఇప్పుడు మాపై విరుచుకుపడటం ఏంటి? అని ప్రశ్నించారు.

More Telugu News