Bigg boss: 'బిగ్ బాస్'లో లైంగిక వేధింపులు... యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదుపై తొలిసారి స్పందించిన స్టార్ మా!

  • శ్వేతారెడ్డి ఫిర్యాదుపై స్టార్ మాకు నోటీసులు
  • స్పందించిన అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గురివిశెట్టి శ్రీధర్‌
  • ఆరోపణలు అవాస్తవాలేనని వెల్లడి

టాలీవుడ్ బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌ బాస్‌ -3 ఓ వ్యభిచార గృహంలా మారిందని, అక్కడ అమ్మాయిలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని జర్నలిస్ట్‌, యాంకర్ శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలపై స్టార్‌ మా టీవీ ప్రతినిధి తొలిసారి వివరణ ఇచ్చారు. బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి తనను తీసుకున్నామని చెప్పి, ఆపై క్యాస్టింగ్‌ కౌచ్‌ కి అంగీకరించక పోవడంతో తొలగించారని ఆరోపిస్తూ, శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, స్టార్‌ మా ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు.

దీనిపై స్టార్‌ మా అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గురివిశెట్టి శ్రీధర్‌ సమాధానం ఇచ్చారు. బిగ్‌ బాస్‌ షో నిర్వాహకుల గురించి చెబుతూ, కార్యక్రమం డైరెక్టర్‌ అభిషేక్‌, ప్రొడ్యూసర్‌ ఎండెమోల్‌ ఇండియా అని తెలిపారు. కంటెస్టెంట్లను ఎన్నో విధాలుగా పరిశీలించి, పరీక్షించి ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. వారి మెంటల్‌ అండ్‌ ఫిజికల్‌ ఆరోగ్యం గురించి తెలుసుకుని వందకు పైగా ప్రశ్నలను సంధిస్తామని అన్నారు. ఆడియన్స్‌ ను అలరించడమే తమ ఉద్దేశమని, వారి హృదయాలను గెలవాలన్న తపన ఉన్నవారికే అర్హత లభిస్తుందని తెలిపారు. అటువంటి వారినే ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి డిపార్ట్‌ మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా శ్యామ్‌ శంకర్ వ్యవహరిస్తుండగా, క్రియేటివ్‌ కన్సల్టెంట్‌ గా అభిషేక్‌ ముఖర్జీ, మేనేజర్‌ గా రవికాంత్, స్టార్‌ మా పీఆర్‌ఓగా రఘు పని చేస్తున్నారని అన్నారు. తమ ఇంటర్వ్యూల్లో ఎవరినీ వేధించలేదని, ఆరోపణలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు. కాగా, శ్యామ్, రవికాంత్, రఘు, అభిషేక్‌ లపై ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

More Telugu News