Valenteer: ఏపీలో వలంటీర్ పోస్టుల ఇంటర్వ్యూలకు 2.67 లక్షల మంది డుమ్మా!

  • రాష్ట్రవ్యాప్తంగా 2,11,043 వాలంటీర్ పోస్టులు
  • మొత్తం 9,62,708 దరఖాస్తులు
  • ఇంటర్వ్యూలకు హాజరైంది 6,58,879 మంది మాత్రమే

ప్రతి 50 ఇళ్లకూ ఓ వాలంటీర్ ను ఏర్పాటు చేసి, ప్రతి ప్రభుత్వ పథకం ఇంటింటికీ నేరుగా చేర్చాలన్న ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఉద్యోగాలకు 9,62,708 దరఖాస్తులు రాగా, వీరిలో దాదాపు 2.67 లక్షల మంది ఇంటర్వ్యూలకు వెళ్లలేదు. ఈ ఉద్యోగాలకు రూ. 5 వేల నెలజీతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే, పోస్టులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికే వస్తాయన్న ప్రచారంతో పాటు, క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం కూడా ఉన్నత చదువులు చదివిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా చేస్తోందని సమాచారం.

ఒకవేళ ప్రతిభతో ఉద్యోగం లభించినా, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని, ఉద్యోగ భద్రత ఉండదని కొందరు, రేషన్ సరుకులను ఇంటింటికీ చేర్చాలన్న నిబంధనతో మరికొందరు అధికారుల ముందు ఇంటర్వ్యూలకు వెళ్లకుండా ఉండిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 2,11,043 వాలంటీర్ పోస్టులుండగా, మొత్తం 9,62,708 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 36,438 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఇంటర్వ్యూలకు హాజరైంది 6,58,879 మంది మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News