Jaipal reddy: 20వ తేదీ నుంచి 28 వరకూ... జైపాల్ రెడ్డికి అసలేమైంది?!

  • 20వ తేదీన జ్వరంగా ఉందని చెప్పిన జైపాల్ రెడ్డి
  • ఆపై ఆసుపత్రిలో ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు
  • గురువారం నాటికి ఊపిరితిత్తుల్లోకి నీరు
  • ఆపై గుండె సంబంధిత సమస్యలతో విషమించిన పరిస్థితి
జైపాల్ రెడ్డి... ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, అకస్మాత్తుగా జ్వరం బారిన పడి, వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించారన్న వార్త ఆయన కుటుంబీకులతో పాటు సన్నిహితులను కలిచివేసింది. ఆయన మరణం ఓ కలలా ఉందని అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతకీ అసలు ఆయనకు ఏం జరిగింది?


20వ తేదీ శనివారం నాటి మధ్యాహ్నం, తనకు జ్వరంగా ఉందని జైపాల్ రెడ్డి, తన ఇంట్లోని వారికి చెప్పారు. ఆ సమయంలో జైపాల్ అల్లుడు, స్వయంగా డాక్టరైన ఆనంద్ అక్కడే ఉన్నారు. జైపాల్ కు మాత్రలు ఇవ్వగా, కాసేపటికి జ్వరం తీవ్రత తగ్గింది. అందరూ ఊపిరి పీల్చుకునేలోగానే, రాత్రి 11 గంటల ప్రాంతంలో జ్వరం తీవ్రంగా వచ్చింది. దీంతో ఇంట్లోనే ఉన్న ఆనంద్, పెద్ద కొడుకు అరవింద్ రెడ్డి జైపాల్ రెడ్డిని గచ్చిబౌలీలో ఉన్న ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. ఆపై ఆదివారం నాడు ఆయన స్వయంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు గమనించిన వైద్యులు, ఐసీయూకు తరలించారు. ఆపై గుండె కొట్టుకోవడం నిదానించింది. దీంతో సోమవారం ఆయనకు వెంటిలేటర్ అమర్చడం జరిగింది.

ఇదే సమయంలో జ్వరం తగ్గకపోగా, న్యూమోనియా సోకింది. గురువారం నాడు ఆయన ఊపిరితిత్తుల్లో నీరు వుందని డాక్టర్లు గుర్తించి దానికి సంబంధించిన చికిత్సను ప్రారంభించారు. వీటికి తోడు గుండె సంబంధిత సమస్యలు కూడా తోడు కావడంతో పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున 1.08 గంటలకు జైపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఒకేసారి పలురకాల సమస్యలు ఏర్పడటం, వయసు పైబడిన కారణంతో చికిత్సకు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆయన కన్నుమూశారని వైద్య వర్గాలు వెల్లడించాయి.
Jaipal reddy
Fever
Hyderabad
Passes Away
Died

More Telugu News