Andhra Pradesh: ఈసారి తిప్పల నాగిరెడ్డి వంతు.. అసెంబ్లీలో నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే!

  • అప్పట్లో వైఎస్ తన నియోజకవర్గానికి రూ.186 కోట్లు కేటాయించారన్న వైసీపీ ఎమ్మెల్యే
  • ఆ మొత్తంలో రూ.1250 కోట్లు తన వార్డుకే కేటాయించారని చెప్పిన నేత
  • విస్తుపోయిన సభలోని సభ్యులు
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారు. చెప్పాలనుకున్నది ఒకటి, చెబుతున్నది మరొకటి కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ కూడా వారి మాటల వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఎండగడుతున్నారు.

మొన్న దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసెంబ్లీలో విద్యావ్యవస్థపై మాట్లాడుతూ.. స్వామి వివేకానందను స్వామి వివేకానందరెడ్డిగా అభివర్ణించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ టీసీఎల్ కంపెనీని జగన్ తీసుకొచ్చారని చెప్పి ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయం సాధించిన తిప్పల నాగిరెడ్డి అసెంబ్లీలో నీటి సమస్యపై మాట్లాడుతూ తడబాటుకు గురయ్యారు.

అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తమ నియోజకవర్గ తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.186 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఆ మొత్తంలో రూ.1250 కోట్లు ఒక్క తన వార్డుకే కేటాయించారని నోరు జారారు. ఆయన వ్యాఖ్యలతో సభలోని సభ్యులు విస్తుపోయారు. ఇక తెలుగు తమ్ముళ్లు అయితే సోషల్ మీడియాలో వైసీపీ నేతను ఆటాడుకుంటున్నారు. ఆయన మాటల వీడియోను సినిమా క్లిప్పింగులతో ఎడిట్ చేసి నవ్వు పుట్టిస్తున్నారు. నియోజకవర్గం మొత్తానికి రూ.186 కోట్లు కేటాయిస్తే.. ఒక్క వార్డుకి రూ.1250కోట్లు ఎలా కేటాయిస్తారంటూ ఆశ్చర్యపోతున్నారు.
Andhra Pradesh
YSRCP
tippala nagireddy
Telugudesam

More Telugu News