Andhra Pradesh: వివాహేతర సంబంధానికి ఒప్పుకోని మహిళ.. విషం మింగి యువకుడి ఆత్మహత్య

  • వివాహేతర సంబంధానికి ఒప్పుకోవాలంటూ మహిళతో మధ్యవర్తిత్వం
  • తిరస్కరించి చీవాట్లు పెట్టిన వివాహిత
  • మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తనతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు మహిళ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని మర్రిపాడులో శనివారం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వెంకట రమణయ్య (21) తన ఇంటికి సమీపంలో ఉండే వివాహితపై మనసు పడ్డాడు. ఈ విషయాన్ని మరో మహిళతో చెప్పి ఆమెను ఒప్పించాల్సిందిగా కోరాడు.

వివాహిత వద్దకు వెళ్లిన ఆమె వెంకట రమణయ్య గురించి చెప్పింది. ఆమె చెప్పింది విన్న వివాహిత విస్తుపోయింది. అతడి ప్రతిపాదనను తిరస్కరించి వార్నింగ్ ఇచ్చి పంపింది. దీంతో మనస్తాపానికి గురైన వెంకట రమణయ్య ఇంట్లో ఉన్న విష గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Nellore District
suicide

More Telugu News