Mahalakshmi Express: వరదనీటిలో చిక్కుకుపోయిన 'మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్' రైలు... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

  • మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
  • వాంగని-బద్లాపూర్ మధ్య నిలిచిపోయిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్
  • ప్రయాణికులను బోట్లలో తరలించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు

ముంబయి సహా మహారాష్ట్రను భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగుతుండడంతో వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా వాంగని, బద్లాపూర్ పట్టణాల మధ్య మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు చిక్కుకుపోయింది. మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలు ముంబయి, కొల్హాపూర్ మధ్య నడుస్తుంది. అయితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా వరదనీరు రైల్వే పట్టాల మీదుగా ప్రవహిస్తుండడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. చుట్టూ వరదనీరు హడలెత్తిస్తుండగా, అంతకంతకు పెరుగుతున్న ప్రవాహంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగి బోట్ల ద్వారా రైలు బోగీల్లోని దాదాపు 500 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News