West Godavari District: ‘జనసేన’ కార్యకర్తలపై దాడులను సహించబోం: నాగబాబు

  • నరసాపురంలో పర్యటించిన నాగబాబు
  • కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే వచ్చా
  • లేనిపోని కేసులు బనాయించడం కరెక్టు కాదు

జనసేన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సహించబోమని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. అధికారంలో ఉన్న వారికి పోలీసులు సపోర్టు చేస్తే చేయొచ్చు గానీ, లేనిపోని కేసులు బనాయించడం కరెక్టు కాదని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎంత బాగా పరిపాలన చేస్తారన్నదే ముఖ్యం తప్ప, ప్రతీకారచర్యలకు పాల్పడటం సబబు కాదని అన్నారు. తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని తెలిసిందని, అలా చేయకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. శ్రుతి మించితే మాత్రం తాము కూడా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తామని, ‘జనసేన’ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.

More Telugu News