lynching: సరే, చంద్రుడిపైకే వెళతా.. టికెట్ బుక్ చేసిపెట్టండి!: బీజేపీకి ఆదూర్ గోపాలకృష్ణన్ కౌంటర్

  • మూకహత్యలపై గళం విప్పిన 49 మంది ప్రముఖులు
  • వీరి లేఖను తప్పుపట్టిన బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్
  • శ్రీరామ్ పేరు వినొద్దనుకుంటే చంద్రుడిపైకి వెళ్లాలని సలహా

దేశంలో దళితులు, ముస్లింలు, ఇతర మైనారిటీలపై మూకహత్యలు, మతవిద్వేష దాడులను నియంత్రించాలని 49 మంది వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాశారు. వీరిలో దర్శకుడు మణిరత్నం, ఆదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్ తో పాటు చరిత్రకారుడు రామచ్రందగుహ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మలయాళ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ పై కేరళ బీజేపీ నేత బి.గోపాలకృష్ణన్‌ మండిపడ్డారు. జైశ్రీరామ్ అనే పదం వినపడకూడదని భావిస్తే చంద్రుడిపైకి వెళ్లి జీవించాలని, శ్రీహరికోటలో పేరు నమోదు చేసుకోవాలని ఆదూర్ గోపాలకృష్ణన్ కు ఆయన సూచించారు.

దీంతో బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆదూర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వాళ్లు ఇచ్చిన ఆఫర్ తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. ‘నేను ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాను. చంద్రుడిపైకీ వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నాను. కాబట్టి నా కోసం ఓ టికెట్ బుక్ చేయండి. అదే చేతితో ఓ హోటల్ గది కూడా బుక్ చేస్తే బాగుంటుంది’ అని చురకలు అంటించారు. మరోవైపు 49 మంది ప్రముఖులు రాసిన లేఖపై బాలీవుడ్ కు చెందిన నటి కంగనా రనౌత్ సహా మరికొందరు మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ లేఖ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News