చంద్రబాబు ఓ గజదొంగ.. ఏపీ సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారు!: ఏపీ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దేవధర్

24-07-2019 Wed 15:56
  • ఏపీని చంద్రబాబు దోపిడీచేశారు
  • ఆయన అవినీతిపై ప్రభుత్వం విచారణ జరపాలి
  • ఏపీలో రాజకీయ శూన్యతను భర్తీ చేస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు ఓ గజదొంగ అని బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దేవధర్ విమర్శించారు. ఆయన రాష్ట్రాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. చంద్రబాబు అవినీతికి సంబంధించి కేసులను వెలికితీసి విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరిలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన నివేదికలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పిస్తుందని దేవధర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అవినీతికి పాల్పడిన నేరస్తులు ఏ పార్టీలో ఉన్నా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ఎవ్వరికీ నమ్మకం లేదనీ, ఎందుకంటే సొంత పార్టీ ఎంపీలే ఆయనపై ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ ఖతం అయిపోయిందని చెప్పారు. ఈ రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.