chattisgarh: వినూత్న పథకం: చెత్త సేకరించి తెచ్చిస్తే సుష్టుగా భోజనం!

  • అర కేజీకి అల్పాహారం...కేజీకి భోజనం
  • అంబికాపూర్‌ నగరంలో వినూత్న పథకం
  • ‘గార్బేజ్‌ కేఫ్‌’ పేరుతో త్వరలో శ్రీకారం

పట్టెడు మెతుకుల కోసం జీవన పోరాటం చేస్తూ చెత్త కుప్పల్లో పడి ప్లాస్టిక్‌ సీసాలు, కవర్లు వెతుక్కునే వారు నిత్యం కనిపిస్తుంటారు. వాటిని అమ్ముకుంటూ వచ్చిన దాంతో కడుపునింపుకొంటూ ఉంటారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు, మరో వైపు చెత్త సేకరణ సులభతరం చేసేందుకు దీన్నే ఓ పథకంగా మార్చితే ఎలా వుంటుంది? ఇటువంటి వినూత్న ఆలోచన చేస్తున్నారు చత్తీస్‌గఢ్‌, సర్గూజాలోని అంబికాపూర్‌ మన్సిపల్‌ అధికారులు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 ర్యాంకుల్లో రెండో స్థానంలో ఉండి క్లీన్‌ సిటీగా పేరొందిన పురపాలక సంస్థలో తాజాగా ’గార్బేజ్‌ కేఫ్‌‘ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో చెత్త సేకరించి జీవనోపాధి పొందుతున్న ఎంతోమందికి, వీధి బాలలకు ఈ పథకం అక్కరకు వస్తుందని భావిస్తున్నారు. వీరు చేయాల్సిందల్లా ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి అందించడమే.

అర కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు అందిస్తే అల్పాహారం, కిలో వ్యర్థాలు అందిస్తే భోజనం పెడతారు. ‘ఓ వైపు స్వచ్ఛత పాటిస్తూ మరోవైపు పేదల ఆకలి తీర్చేందుకు ఉపయుక్తమవుతుందన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నాం. ఈ పథకం వల్ల రోడ్లపైన, వీధుల్లో పడివున్న వ్యర్థాలు సేకరించే అవకాశం కలుగుతుంది’ అని అంబికాపూర్‌ మేయర్‌ తెలిపారు.

More Telugu News