'టిక్ టాక్' ప్రేమ... మోసం చేశాడని వివాహిత ఫిర్యాదు!

24-07-2019 Wed 09:33
  • వివాహిత పెట్టే వీడియోలు లైక్ చేసిన వ్యక్తి
  • పెళ్లి చేసుకుంటానని షికార్లు తిప్పిన వైనం
  • మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు

ఇంతవరకూ ఫేస్ బుక్, వాట్స్ యాప్ పరిచయాలు స్నేహంగా, ప్రేమగా మారడం చూశాం. కానీ, ఈ కేసు టిక్ టాక్ పరిచయం ప్రేమగా మారిన వాస్తవ ఘటన. తాను పెడుతున్న వీడియోలను తెగ లైక్ చేస్తున్న ఓ వ్యక్తిని ప్రేమించిన వివాహిత యువతి దారుణంగా మోసపోయింది. పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, హైదరాబాదులో భర్తతో విభేదాలు వచ్చి, విడిగా ఉంటున్న ఓ వివాహిత, టిక్ టాక్ యాప్ లో వీడియోలను అప్ లోడ్ చేస్తుండగా, ఓ వ్యక్తి ఆమె హావభావాలకు లైక్ లు కొట్టాడు.

దీంతో వారిద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఏ విధమైన ఉద్యోగం చేయని అతను, మాయ మాటలతో ఆమెకు దగ్గరయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, చివరికి పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించింది. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని, అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనను షికార్లకు తిప్పి, వాడుకుని, ఇప్పుడు మోసం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.