Jammu And Kashmir: పాక్ ప్రధాని వద్ద ట్రంప్ 'కశ్మీర్' ప్రస్తావన.. ఖండించిన భారత్!

  • కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న ట్రంప్
  • మోదీ కూడా అడిగారన్న అమెరికా అధ్యక్షుడు
  • ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామన్న భారత్ 
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పక్కనుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్-ఇమ్రాన్ ఖాన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం నెరపాల్సిందిగా తనను కోరారని ఇమ్రాన్‌తో అన్నారు. పాకిస్థాన్ కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తనను ఆహ్వానిస్తే పాకిస్థాన్‌లో పర్యటిస్తానని ఇమ్రాన్‌తో పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం రెండు దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పాకిస్థాన్ వస్తానన్న ట్రంప్ ప్రతిపాదనకు ఇమ్రాన్ వెంటనే ఓకే చెప్పేశారు. ‘అమ్మమ్మా.. ఎంతమాట. మీరు వస్తానంటే అదే భాగ్యం’ అనేసి వెంటనే ఆహ్వానించేశారు. ‘‘మీరు మా దేశానికి రావడం వల్ల కోట్లాదిమంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే, భారత్-పాక్ మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్య కూడా పరిష్కారమవుతుంది’’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

అయితే, ట్రంప్-ఇమ్రాన్ సమావేశంపై వైట్‌హౌస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన లేకపోవడం విశేషం. మరోవైపు, కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించమని మోదీ కూడా అడిగారన్న ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్ వివాదాన్ని అంతర్గత సమస్యగానే భావిస్తామని, ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని, మధ్యవర్తిత్వాన్ని సహించబోమని తేల్చి చెప్పింది.
Jammu And Kashmir
Donald Trump
Imran khan
Narendra Modi

More Telugu News