Andhra Pradesh: త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • విధివిధానాలపై కసరత్తు చేస్తున్న సర్కారు
  • రెండుమూడు రోజుల్లో ఫీజులపై స్పష్టతనిస్తామన్న మంత్రి
  • ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తున్నామంటూ వెల్లడి

ఏపీలో త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్ విధివిధానాలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఫీజులపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టతనిస్తామని మంత్రి వెల్లడించారు. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తెస్తున్నామని, దాని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. విద్యాశాఖలోని సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం చెప్పారని, ఆ దిశగా కృషిచేస్తున్నామని వివరించారు.

డీఎస్సీ 1998, 2008, 2012 అభ్యర్థుల సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని, కటాఫ్ మార్కులు తగ్గించడం వల్ల 1998 డీఎస్సీలో సమస్య ఏర్పడిందని, తద్వారా 5 వేల మంది వరకు ఇబ్బందులు పడుతున్నారని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఇక, 2008 డీఎస్సీ బాధితుల అంశంలో ఎమ్మెల్సీ కమిటీ నివేదిక అందించిందని చెప్పారు.

2008 డీఎస్సీకి సంబంధించి 4,657 మంది బాధితులు ఉండగా, 3,636 మంది ఆ తర్వాత డీఎస్సీల్లో ఉద్యోగాలు పొందారని, మిగిలినవారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి కోసం చూస్తున్నామని, అనుమతి రాగానే ఉద్యోగాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2012 డీఎస్సీ బాధితుల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో నిర్వహించే డీఎస్సీలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నామని, 2018 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని అన్నారు.

More Telugu News