Andhra Pradesh: రెడ్లను పైకి తెచ్చేందుకే జగన్ బీసీలను అణగదొక్కుతున్నారు!: టీడీపీ నేత యనమల

  • బీసీలకు జగన్, వైఎస్ అన్యాయం చేశారు
  • తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నిన్న బీసీ సమాఖ్య చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు పలువురు బీసీ ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల తీవ్రంగా స్పందించారు. బీసీలను అణగదొక్కుతున్న జగన్ కు అభినందనలు తెలిపేందుకు వీరు వెళ్లారా? అని ప్రశ్నించారు. బీసీలకు జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. అమరావతిలో ఈరోజు మీడియాతో యనమల మాట్లాడారు.

బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని యనమల వ్యాఖ్యానించారు. ఆదరణ-1 పథకాన్ని వైఎస్ రద్దు చేస్తే, ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ ఆదరణ-2 పథకాన్ని రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీయేనని స్పష్టం చేశారు.

ఎన్నికల సందర్భంగా 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారనీ, ఇప్పుడు దాన్ని 40కే పరిమితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత సామాజికవర్గాన్ని పైకి తెచ్చేందుకే జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. అధికారం చేపట్టి 2 నెలలు కాకముందే ముగ్గురు బీసీలను హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News