Vijayasanthi: తెలంగాణలో ఇంతకాలం పాలనే జరగలేదన్న విషయం ఇప్పుడర్థమవుతోంది: విజయశాంతి

  • సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన 'రాములమ్మ'
  • ఏంచేసినా చెల్లుతుందనుకుంటున్నారు అంటూ ట్వీట్
  • కేసీఆర్ కు తెలంగాణ ప్రజల బాధలు జోక్ లా కనిపిస్తున్నాయంటూ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. దేశంలో ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచేలా ఆగస్టు 15 నుంచి అసలు పాలన మొదలవుతుందని కేసీఆర్ చెప్పడం ద్వారా, ఇప్పటివరకు తెలంగాణలో అసలు పాలన జరగలేదన్న విషయం తెలుస్తోందని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు వింటుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఎంతటి దుస్థితి దాపురించిందో అర్థమవుతోందని, అధికారం చేతిలో ఉంది కదా అని కేసీఆర్ ఏంచేసినా చెల్లుతుందని అనుకోవడం దురదృష్టకరం అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.  

మూడేళ్లలో అద్భుతం జరగనుందని కేసీఆర్ చెబుతున్నారని, ఆయనకు తెలంగాణ ప్రజల బాధలు ఓ జోక్ లా అనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు నిరసనలను కూడా జోక్ గా తీసుకునే కేసీఆర్ కు చివరికి న్యాయస్థానం ఆదేశాలు కూడా పరిహాసంగానే ఉంటాయని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు కూలుస్తామని కేసీఆర్ సర్కారు చెబుతోందని, ఎర్రమంజిల్ లో ఉన్న గెస్ట్ హౌస్ ఓ సాంస్కృతి భవనం అని తెలిసినా దాన్ని కూడా కూలుస్తామనడం కేసీఆర్ కే చెల్లిందని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో ఎర్రమంజిల్ అతిథి గృహం కూడా అక్రమకట్టడంలానే కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో కొత్తగా వచ్చే మున్సిపల్ చట్టం సాయంతో అక్రమకట్టడాలు కూలుస్తామని చెబుతున్నారని, కానీ, ఏది అక్రమ కట్టడమో, ఏది సక్రమ కట్టడమో తెలియని అయోమయ పరిస్థితిలో టీఆర్ఎస్ సర్కారు ఉందని విజయశాంతి ఎద్దేవా చేశారు.

More Telugu News