Peacock: నెమళ్లను చంపిన వ్యక్తిని కొట్టి చంపేశారు!

  • నాలుగు నెమళ్లను చంపిన నలుగురు వ్యక్తులు
  • ఒక వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాధితుడు

జాతీయ పక్షి అయిన నెమళ్లను చంపిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. మధ్యప్రదేశ్ లోని లసూడియా అత్రి గ్రామంలో ఈ ఘటన నిన్న చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హీరాలాల్ బన్చందగా గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆయన... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ 100కు ఒక వ్యక్తి ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పాడని తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడని వెల్లడించారు. దాడికి పాల్పడిన పది మందిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని... వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు, నెమళ్లను చంపినందుకు మృతుడితో పాటు అతని కుమారుడు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. మిగిలిన ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.

నిన్న రాత్రి 9 గంటల సమయంలో నెమలిని చంపిన నలుగురు వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో పరుగెత్తుతుండగా... స్థానికులు వారిని చూశారు. వారిని వెంటాడి ఒక వ్యక్తిని (హీరాలాల్) పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు చనిపోయిన నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతన్ని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హీరాలాల్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

జాతీయ పక్షిని చంపడం తీవ్రమైన నేరమన్న సంగతి తెలిసిందే. భారత అటవీ చట్టం 1972 కింద నెమలిని చంపినవారకి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

More Telugu News