Madhya Pradesh: కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన యువకుడు.. ఆపరేషన్ చేసి 33 వస్తువులు బయటకు తీసిన డాక్టర్లు!

  • మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లాలో ఘటన
  • ఎక్స్ రే పరీక్ష చేసి విస్తుపోయిన డాక్టర్లు
  • ఆపరేషన్ చేసి పెన్ను, పెన్సిల్, కత్తులు వెలికితీత

కడుపు నొప్పితో ఉందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు విస్తుపోయారు. అతని కడుపులో కత్తులు, సూదులు, ఎరేజర్లు సహా 33 రకాల వస్తువులు ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఛత్తర్ పూర్ జిల్లా బుందేల్ ఖండ్ కు చెందిన యోగిత్ సింగ్(30) పెన్ను, పెన్సిల్, ఇనుప కత్తులు, ఎరేజర్ సహా పలు వస్తువులను మింగేశాడు. దీంతో ఆయనకు కడుపునొప్పి వచ్చింది.

కుటుంబ సభ్యులు వెంటనే యోగిత్ ను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితుడికి ఎక్స్ రే తీసిన వైద్యులు కడుపులో పలు వస్తువులు ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి పెన్ను, పెన్సిల్, కత్తులు సహా 33 వస్తువులను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం యోగిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.

More Telugu News