Andhra Pradesh: బిగ్ బాస్-3 రగడ.. అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ!

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న రియాలిటీ షో
  • బిస్ బాస్-3కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున
  • ఇప్పటికే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్-3 నిరసనల సెగ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కూడా తగిలింది. తెలుగు బిగ్ బాస్-3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిని ఈరోజు ఉస్మానియా జేఏసీ ముట్టడించింది.  ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు బిగ్ బాస్-3 కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు ఈ కార్యక్రమం హోస్ట్ గా నాగార్జున తప్పుకోవాలని నినాదాలు ఇచ్చారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో నాగార్జున ఇంటి వద్ద మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బిగ్ బాస్ నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే వివాదంలో చిక్కుకుంది. ఈ విషయమై తెలంగాణ మానవహక్కుల కమిషన్ కు ఓయూ జేఏసీ ఫిర్యాదు చేసింది. స్త్రీ, పురుషులను ఒకే ఇంట్లో 100 రోజులు బంధించి, కెమెరాలతో చిత్రీకరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికింది. ఈ షోను అడ్డం పెట్టుకుని మహిళలను లైంగికంగా దోచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో జేఏసీ పేర్కొంది. రేపటి నుంచి బిగ్ బాస్-3 షో ప్రసారం కానుంది. 
Andhra Pradesh
Telangana
Big boss-3
telugu
Nagarjuna
home
House
OU jac

More Telugu News