Andhra Pradesh: వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు.. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ ను రద్దుచేసిన హైకోర్టు!

  • గతేడాది అక్టోబర్ 25న జగన్ పై దాడి
  • కేసును విచారణకు స్వీకరించిన ఎన్ఐఏ
  • ఇంకా విచారణ పూర్తికాలేదని కోర్టుకు వివరణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. జగన్ పై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు జారీచేసిన బెయిల్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై గతేడాది అక్టోబర్ 25న దాడి జరిగింది. ఈ ఘటన అనంతరం హైదరాబాద్ కు నేరుగా వెళ్లిపోయిన జగన్, అక్కడే చికిత్స తీసుకున్నారు. ఈ కేసును తొలుత ఏపీ పోలీసులు దర్యాప్తు చేయగా, అనంతరం వారి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు విచారణ బాధ్యతను బదిలీ చేశారు.

ఈ క్రమంలో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తికానందున నిందితుడి బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. జగన్ పై జరిగిన దాడి పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు సరైన కారణాలు చెప్పాలనీ, అయితే దీన్ని దిగువకోర్టు పట్టించుకోలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

అయితే శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వడం సమంజసమేనని ఆయన న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శ్రీనివాస్ బెయిల్ ను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చింది.  

More Telugu News