ట్రంప్ వలస విధానంపై నిరసనలు.. అమెరికాలో 200 మంది క్రైస్తవ మతపెద్దలు, సన్యాసినులు అరెస్ట్!

19-07-2019 Fri 12:38
  • తల్లిదండ్రుల నుంచి చిన్నారులను విడదీయడంపై నిరసన
  • ట్రంప్ పై నిప్పులు చెరిగిన క్రైస్తవ మతపెద్దలు
  • క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా వెళుతున్నారని ఆగ్రహం

అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న విదేశీయుల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచుతోంది. దీనిపై మానవహక్కుల సంఘాలు ఉద్యమించినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొందరు క్రైస్తవ మత పెద్దలు, సన్యాసినులు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను విడదీసే భయంకర సంస్కృతికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు రాజధాని వాషింగ్టన్ డీసీ లోని క్యాపిటల్ హిల్ భవంతిలో కూర్చుని, పడుకుని నిరసన తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 200 మంది మత పెద్దలు, సన్యాసినులను అరెస్ట్ చేశారు. క్రైస్తవ మతపెద్దలకు పలువురు ప్రజలు తమ మద్దతును తెలియజేశారు. ఈ విషయమై ఆందోళనకారులు మాట్లాడుతూ.. పిల్లలను ప్రేమించాలన్న ఏసు క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ఆందోళనకు పలువురు కేథలిక్ మతపెద్దలు మద్దతు తెలిపారని చెప్పారు.