amaravathi: చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం తిరస్కరించింది: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి

  • నిబంధనలు పాటించకుండా భూసేకరణ
  • రైతుల ఫిర్యాదుతో అప్రమత్తమైన బ్యాంక్‌
  • ఇప్పుడు నింద వైసీపీ మీదకు నెట్టేయాలని చూస్తున్నారు

రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరువల్లే ప్రపంచ బ్యాంకు రుణం తిరస్కరించిందని, కానీ బాబు తెలివిగా ఆ నింద వైసీపీపైకి నెట్టేయాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకుకు రుణం అడిగింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం అన్నారు.

 అయితే భూసేకరణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతు, కౌలు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుందని, ఎదురు తిరిగిన వారిని భయాందోళనకు గురి చేశారని, దళితుల భూములు కాజేయాలని చూశారని ఆరోపించారు. చట్టప్రకారం పరిహారం కూడా ఇవ్వడం లేదని రైతులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

భూ రికార్డులు కూడా తారుమారు చేస్తున్నారంటూ రైతులు ఫిర్యాదు చేయడంతో ప్రపంచ బ్యాంక్‌ అప్రమత్తమయ్యిందన్నారు. వాస్తవాన్ని గుర్తించి రుణం తిరస్కరించింది తప్ప ఈ వ్యవహారంతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఫిర్యాదు చేయడం వల్లే రుణం తిరస్కరించారని టీడీపీ నాయకులు  ప్రచారం చేస్తున్నారని చేస్తున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News