Odisha: బిడ్డ అంత్యక్రియలకు డబ్బుల్లేక.. ఆమె ఎంచుకున్న మార్గం అదే!

  • మృతదేహాన్ని ఒడిలో ఉంచుకునే బొమ్మల వ్యాపారం
  • కాస్త డబ్బు చేతిలో పడితే శ్మశానానికి తీసుకువెళ్లవచ్చని ఆరాటం
  • విషయం తెలిసి సాయపడిన స్థానికులు, అధికారులు

పెల్లుబికి వస్తున్న కన్నీటిని రెప్పల మాటున దాచుకుని కర్తవ్యం కోసం వృత్తినే నమ్ముకున్న ధీరవనిత ఆమె. ఈ చేతిలో చనిపోయిన బిడ్డ, మరో చేతితో వ్యాపారం నిర్వహిస్తూ కనిపించిన ఆమె దీనగాథ విన్న వారికే కన్నీరు తెప్పించింది. అనారోగ్యంతో సతమతమవుతున్న బిడ్డ చేతిలో సేద దీరుతూనే కన్నుమూసింది. ఆమె అంతిమ సంస్కారానికి చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ పరిస్థితుల్లో ఆమె వ్యాపారాన్నే నమ్ముకుంది.

వివరాల్లోకి వెళితే...ఒడిశాలోని కటక్‌ నగరం బక్షి బజార్‌కు చెందిన భారతికి ఐదేళ్లలోపు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక కుటుంబాన్ని గాలికి వదిలేసి భర్త సుభాష్‌నాయక్‌ ఎటో వెళ్లిపోవడంతో వారి పెంపకం బాధ్యత భారతిపైనే పడింది. చిన్నచిన్న బొమ్మలు అమ్ముకుంటూ వారిని పోషించుకుంటోంది. వీరిలో ఏడాది వయసున్న చిన్న కుమార్తె కొద్దిరోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. సరైన వైద్యం అందక బుధవారం సాయంత్రం ఆమె తల్లి ఒడిలోనే కన్నుమూసింది.

కన్నబిడ్డ కన్నుమూసిందని తెలియగానే భారతి కన్నీటి పర్యంతమయింది. ఆమెను కాటికి పంపించేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో బొమ్మలు అమ్మితే వచ్చే డబ్బుతో బిడ్డ అంత్యక్రియలు జరిపించవచ్చని భావించింది. బిడ్డ మృతదేహాన్ని ఒడిలో ఉంచుకునే వ్యాపారం నిర్వహించింది. కాసేపటికి ఈ విషయం బయటకు తెలియడంతో ఆమె దీనగాథ స్థానికులను కదిలించింది. తలో చేయి వేసేందుకు ముందుకువచ్చారు.

అలాగే స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని శ్మశానానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం పూర్తయ్యాక భారతి దీనగాథను తెలుసుకున్న జిల్లా శిశు సంక్షేమ అధికారులు మిగిలిన ఇద్దరు చిన్నారులను బసుంధర ఆశ్రమానికి తరలించారు.

More Telugu News