Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు

  • శ్రీమంత్ పాటిల్ ఆచూకీ లేని వైనం
  • విధానసౌధ పోలీసులకు ఫిర్యాదుచేసిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

కర్ణాటక రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య విధానసౌధ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు.

శ్రీమంత్ పాటిల్ ఆచూకీ కోసం విధానసౌధ పోలీసుల బృందం ముంబయి తరలివెళ్లింది. కాగా, విశ్వాస పరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి గైర్హాజరైనవారిలో ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కూడా ఉన్నాడు. మొదట్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దాంతో సభలో కలకలం రేగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ స్పందించి, సదరు ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనా? వాళ్లు ఇప్పుడెక్కడున్నారు? వంటి వివరాలు తెలియజేయాల్సిందిగా హోంమంత్రిని ఆదేశించారు.

More Telugu News