India: 2019-20 సీజన్ లో టీమిండియా షెడ్యూల్ ఇదే!

  • ఇంటా బయటా వరుస సిరీస్ లు
  • సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్ లు ఆడనున్న భారత్
  • వచ్చే నెలలో విండీస్ పర్యటనతో సీజన్ ఆరంభం

ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లతో బిజీగా గడిపిన టీమిండియా క్రికెటర్లు మరో ఊపిరి తిరగని షెడ్యూల్ కు సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనతో 2019-20 సీజన్ కు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడినుంచి భారత జట్టు అనేక సిరీస్ లో పాల్గొననుంది. అయితే వాటిలో సొంతగడ్డపై ఆడే మ్యాచ్ లే ఎక్కువగా ఉన్నాయి. కరీబియన్ టూర్ తర్వాత టీమిండియా 2020లో మాత్రమే మరో విదేశీ పర్యటనకు వెళ్లనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత జట్టు కివీస్ గడ్డపై మ్యాచ్ లాడనుంది. ఈలోపు అనేక జట్లు భారత్ లో పర్యటించనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా సొంతగడ్డపై సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3టి20లు, 3 టెస్టు మ్యాచ్ ల్లో తలపడనుంది. ఆపై బంగ్లాదేశ్ జట్టు నవంబర్ లో భారత్ లో పర్యటనకు రానుంది. ఈ సందర్భంగా టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య 3 టి20 మ్యాచ్ లు, 2 టెస్టులు జరగనున్నాయి. ఇక, ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా విండీస్ జట్టు ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ లో పర్యటించనుంది. ఈ సందర్భంగా 3 టి20లు, 3 వన్డేలు ఆడనున్నారు.

ఆపై జింబాబ్వే జట్టు కూడా భారత్ తో 3 టి20లు ఆడేందుకు వచ్చే ఏడాది ఆరంభంలో ఉపఖండంలో అడుగుపెట్టనుంది. అన్నిటికంటే ముఖ్యంగా, బలమైన ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డే మ్యాచ్ ల కోసం జనవరిలో భారత్ వస్తోంది. ఈ పర్యటన ముగిసిన కొన్నిరోజులకే టీమిండియా సుదీర్ఘ పర్యటన నిమిత్తం న్యూజిలాండ్ వెళుతుంది. అక్కడ 5 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. ఇక, దక్షిణాఫ్రికా జుట్టు 3 వన్డేల కోసం మళ్లీ భారత్ రానుంది. ఈ సిరీస్ మార్చి 12న ఆరంభం అవుతుంది.

More Telugu News