Chandrababu: చంద్రబాబు తను వుంటున్న ఇంటిని ఖాళీ చేయడం మంచిది.. ఆ ఇంటిని కూల్చడం మాత్రం ఖాయం: బొత్స

  • కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై మండలిలో చర్చ
  • అప్పుడు గుర్తుకు రాని చట్టాలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించిన టీడీపీ
  • 26 అక్రమ కట్టడాలను గుర్తించామన్న బొత్స
ఏపీ శాసనమండలిలో ఈరోజు కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై వాడీవేడి చర్చ జరిగింది. చంద్రబాబుపై ఉన్న కక్షతోనే అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేశారని టీడీపీ సభ్యులు విమర్శించారు. కరకట్టపై నిర్మాణాలకు రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారని... అప్పుడు గుర్తుకు రాని చట్టాలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? అని టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు.

దీనికి సమాధానంగా బొత్స మాట్లాడుతూ, కరకట్టపై 26 అక్రమ నిర్మాణాలను గుర్తించామని చెప్పారు. నది వెంబడి ప్రజావేదిక ఉండకూడదనే నిబంధనలను చంద్రబాబు తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో లింగమనేని రమేశ్ తో పాటు అందులో అద్దెకు ఉంటున్న చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేశామని తెలిపారు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయడం మంచిదని... ఆ భవనాన్ని కూల్చడం ఖాయమని చెప్పారు. ప్రజావేదికకు అనుమతులిచ్చిన అధికారుల నుంచే రూ. 8 కోట్లు వసూలు చేస్తామని తెలిపారు.
Chandrababu
Botsa Satyanarayana
Karakatta
Prajavedika
Telugudesam
YSRCP

More Telugu News