Andhra Pradesh: నేను చంద్రబాబును సూటిగా ఒక్కటే అడుగుతున్నా!: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • నీటి కొరత, విత్తనాల కొరత టీడీపీ చలవే
  • వనజాక్షి, నారాయణ విషయంలో వాయిదా తీర్మానాలను టీడీపీ ప్రభుత్వం తీసుకోలేదు
  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వైసీపీ నేత

అన్నివర్గాలకు న్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వం 2019-20 బడ్జెట్ ను రూపొందించిందని నగరి ఎమ్మెల్యే, వైసీపీ నేత రోజా తెలిపారు. ఏపీలో నీటి కొరత, విత్తనాల కొరత టీడీపీ చేసిన పాపమేనని దుయ్యబట్టారు. జనవరిలోనే విత్తనాలు సేకరించాల్సి ఉండగా,  టీడీపీ ప్రభుత్వం వాటిని సేకరించలేదని విమర్శించారు.

కానీ సీఎం జగన్ పక్క రాష్ట్రాల నుంచి 3.5 లక్షల టన్నుల విత్తనాలు తీసుకొచ్చి రైతులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలే ఇవ్వనట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడారు.

‘రక్తం రుచిమరిగిన పులి నోటి నిండా రక్తం పెట్టుకుని నా మీద దాడి జరిగింది అని గగ్గోలు పెట్టినట్లు, టీడీపీ నాయకులు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో మా నేతలపై దాడి చేసి, 'మాపైనే దాడి జరిగింది' అని మా నెత్తిన పులమడం ఎంతవరకూ సమంజసం? నేను చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ రౌడీ ఎమ్మెల్యే ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టినప్పుడు మేం వాయిదా తీర్మానం ఇస్తే ఎందుకు తీసుకోలేదు? దానిపై ఎందుకు చర్చించలేదు? శిక్షించాల్సిన మీ ఎమ్మెల్యేను శిక్షించకుండా, ఎమ్మార్వోను పిలిపించి బెదిరించి, సెటిల్ మెంట్ చేసిన మీరా మాట్లాడేది?

కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారన్న కారణంతో మేం రెండురోజులు వాయిదా తీర్మానం ఇచ్చినా పట్టించుకోలేదు. నాపై తప్పుడు నిందలు వేసి ఏడాది పాటు సస్పెండ్ చేసిన మీరా శాంతిభద్రతల గురించి మాట్లాడేది? నారాయణ కాలేజీలో తమ పిల్లలు ఎందుకు చనిపోతున్నారో తెలియక తల్లిదండ్రులు కంటతడి పెడుతుంటే, మీకు, మీ పార్టీకి డబ్బులు ఇస్తారన్న కారణంతో వాయిదా తీర్మానాన్ని అడ్డుకున్న మీరా మాట్లాడేది?’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News