Ys: ఇంకా నయం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదు!: బుగ్గనపై లోకేశ్ సెటైర్లు

  • కియా పరిశ్రమ ఏర్పాటు చేయాలని 2007లోనే వైఎస్సార్  లేఖ రాశారట
  • మరి, అప్పుడు ఎందుకు రాలేదు?
  • ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం, జగన్ క్విడ్ ప్రోకో చూసి భయపడ్డారేమో!

ఏపీకి కియా పరిశ్రమను తీసుకొచ్చింది తామేనని టీడీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశాన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. ఈ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతూ 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే లేఖ రాయడం జరిగిందని, ఆయన విన్నపం మేరకే ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేశామని సంబంధిత లేఖలో కియా పరిశ్రమ స్పష్టం చేసినట్టు బుగ్గన పేర్కొన్నారు. బుగ్గన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ఏపీలో 2007లోనే కియా పరిశ్రమను ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరితే, ఏర్పాటు చేస్తామని వాళ్లు మాటిచ్చారట, మరెందుకు రాలేదో!  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం, జగన్ క్విడ్ ప్రోకో చూసి భయపడ్డారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి కియా పరిశ్రమను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డే అంటున్న బుగ్గన, ఇంకా నయం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే అనలేదంటూ సెటైర్లు గుప్పించారు.

కాగా, అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతున్న వీడియోలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన సినిమాలో ఓ సన్నివేశాన్ని, ‘జబర్దస్త్’ సన్నివేశాలను, కొన్ని పేపర్లలో వచ్చిన క్లిప్సింగ్స్ ను మిక్స్ చేసి ఈ వీడియోను నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

More Telugu News