Andhra Pradesh: చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలు వేస్తేనే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి: ఎమ్మెల్యే ధర్మాన

  • ప్రస్తుత ప్రభుత్వం ఏ దిశగా వెళుతుందో చూడండి
  • చూడకుండానే తప్పులు వెతికే ప్రయత్నం చేయొద్దు
  • సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నా

చంద్రబాబు హయాంలో ఆ పార్టీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండేదని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ధర్మాన మాట్లాడుతూ, ఇంటిపై టీడీపీ జెండా కడితేనే, పచ్చ చొక్కాలు వేస్తేనే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ దిశగా వెళుతుందో చూడకుండా వాటిలో తప్పులు వెతికే ప్రయత్నం మంచిది కాదని హితవు పలికారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యను ఇష్టానుసారంగా ప్రోత్సహించడంతో, వారు దోపిడీ చేసుకుంటూ వెళ్లిపోయారని, ఆ తప్పులను సరిదిద్దడానికి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని అన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో, తమ పిల్లలను వ్యవసాయం వైపు చూడనివ్వడం లేదని, ఇతర రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు చివరకు ఏమీ మిగలడం లేదని అన్నారు. అందుకే, తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలని ప్రవేశపెడుతోందని అన్నారు. ‘రైతు భరోసా’, తొమ్మిది గంటల కరెంట్, రైతులకు ఇన్సూరెన్స్, సున్నా వడ్డీ రుణాలు ఇవన్నీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలేనని అన్నారు. ఈ బడ్జెట్ లో కేటాయింపులు సరిపోకుంటే మరిన్ని కేటాయింపులు జరుగుతాయని ధర్మాన చెప్పారు.

More Telugu News