Morgan: ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల కెప్టెన్ల వ్యాఖ్యలు

  • ముగిసిన ప్రపంచకప్ పోటీలు
  • స్టోక్స్, బట్లర్, ఆర్చర్ లపై మోర్గాన్ ప్రశంసలు
  • మరో 20 పరుగులు సాధిస్తే గెలిచేవాళ్లమన్న విలియమ్సన్

ఎట్టకేలకు క్రికెట్ వరల్డ్ కప్ పుట్టింటికి చేరింది. ఇంగ్లాండ్ జట్టు ప్రపంచవిజేతగా అవతరించింది. గతకొన్నాళ్లుగా వన్డేల్లో అమేయశక్తిగా అవతరించిన ఇంగ్లాండ్ తనది గాలివాటు ప్రస్థానం కాదని నిరూపిస్తూ, ఉత్కంఠభరిత క్షణాల్లో గుండెనిబ్బరం చూపిస్తూ న్యూజిలాండ్ పై సూపర్ ఓవర్ లో పైచేయి సాధించింది. తద్వారా సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలిచి మురిసిపోయింది. అయితే, కివీస్ దురదృష్టం ఈ వరల్డ్ కప్ లోనూ వెంటాడింది. 2015లోనూ ఆ జట్టు రన్నరప్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు కూడా ద్వితీయస్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

'కేన్ విలియమ్సన్ కు నా సానుభూతి తెలుపుతున్నాను. ఇంత కఠినమైన మ్యాచ్ లో న్యూజిలాండర్లు చూపిన తెగువ, స్ఫూర్తి అమోఘం. నాలుగేళ్లుగా మేం ఎదురుచూసిన క్షణాలు ఇవే. ఇన్నేళ్లకాలంలో మేం ఎంతో అభివృద్ధి సాధించాం. జోఫ్రా ఆర్చర్ మా తురుపుముక్క. ఇప్పుడు ప్రపంచమే అతని పాదాక్రాంతమైంది. సూపర్ ఓవర్ లో అద్భుతంగా ఆడిన స్టోక్స్, బట్లర్ లతో పాటు జోఫ్రాకు ఈ విజయంలో పాత్ర ఉంది' అంటూ ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు.
'చివర్లో మేం ఒక్క అదనపు పరుగు సాధించలేక ఓడిపోయి ఉండొచ్చు గాక. కానీ మ్యాచ్ లో చాలా చిన్నచిన్న అంశాలు కూడా మాకు వ్యతిరేకంగా పరిణమించాయి. నిజంగా ఇంగ్లాండ్ ప్రస్థానం అద్వితీయం. వారికి శుభాభినందనలు. ఇక్కడి పిచ్ లు ఎంతో ప్రతికూలంగా మారాయి. అందరూ 300 పైచిలుకు స్కోర్ల గురించి మాట్లాడుతుంటే మేం అలాంటి భారీ స్కోర్లను పెద్దగా నమోదు చేయలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ లో టై కావడంతో మావాళ్లు కోలుకోలేకపోతున్నారు. నిజంగా ఇది భరించలేని బాధ. మేం మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే గెలిచేవాళ్లమేమో!' అంటూ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

More Telugu News