Rahul Gandhi: యువత నీలాంటి నాయకులను కోరుకుంటోంది... రాహుల్ కు లేఖ రాసిన రాబర్ట్ వాద్రా

  • ఫేస్ బుక్ లో సందేశం పోస్టు చేసిన వాద్రా
  • రాహుల్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కితాబు
  • నీ వెంటే నడుస్తానంటూ రాహుల్ కు మద్దతు

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తన పట్టువిడవడంలేదు. ఎవరెంత చెప్పినా అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా, రాహుల్ ను ఉద్దేశించి ఆయన బావ రాబర్ట్ వాద్రా ఏకంగా ఓ లేఖ రాశారు. యువతకు నీ మార్గదర్శకత్వం ఎంతో అవసరం అంటూ ఫేస్ బుక్ లో లేఖను పోస్టు చేశారు.

దేశంలోని యువతీయువకులు రాహుల్ భావజాలాన్ని ఇష్టపడుతున్నారని, రాహుల్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాద్రా తన బావమరిదిని ప్రశంసల్లో ముంచెత్తారు. పదవిని తృణప్రాయంగా వదిలేసి ప్రజాసేవ కంటే ఎక్కువేదీ కాదని నిరూపించారని అభినందించారు.

భారతదేశ జనాభాలో 65 శాతం యువతీయువకులేనని, వాళ్లందరూ కూడా 45 ఏళ్ల లోపు వాళ్లేనని, వాళ్లు రాహుల్ తదితర యువనేతల వైపు చూస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరితో మమేకం కావాలంటూ రాహుల్ తీసుకున్న నిర్ణయం అద్భుతమని పేర్కొన్నారు. పార్టీ పదవి కంటే ప్రజాసేవే మిన్న అని భావించిన రాహుల్ వెంట తాను కూడా నడుస్తానంటూ వాద్రా తన పోస్టులో తెలిపారు.

More Telugu News