Jagan: పీపీఏలను రద్దు చేయడం చట్టవిరుద్ధం అవుతుంది: జగన్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి లేఖ

  • పునరుత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి
  • కాంట్రాక్టులను గౌరవించకపోతే ఇన్వెస్టర్లు వెళ్లిపోతారు
  • టారిఫ్ లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీలు నిర్ధారిస్తాయి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని... వాటిని సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇంతకు ముందే ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఇంధనశాఖ లేఖ రాసింది. పీపీఏ (పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్) లను సమీక్షించవద్దని లేఖలో పేర్కొంది.

తాజాగా జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఇందనశాఖ మంత్రి ఆర్కే సింగ్ మరో లేఖ రాశారు. పునరుత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని... కాంట్రాక్టులను గౌరవించడం లేదనే కారణంతో ఇన్వెస్టర్లు వెళ్లిపోతే, పెట్టుబడులు రావని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ టారిఫ్ లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు నిర్ధారిస్తాయని తెలిపారు. పీపీఏలను రద్దు చేయడం చట్టవిరుద్ధమవుతుందని చెప్పారు. అవినీతి జరిగినట్లు ఆధారాలుంటే రద్దు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని... లేని పక్షంలో రద్దు చేయడం కుదరదని తెలిపారు. సోలార్, పవన్ విద్యుత్ టారిఫ్ లను స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారని చెప్పారు. వివిధ రాష్ట్రాల టారిఫ్ లను పంపుతున్నామని... వాటిని చూస్తే, ఏపీ కుదుర్చుకున్న పీపీఏలు న్యాయమో, కాదో మీకు అర్థమవుతుందని తెలిపారు.

More Telugu News