Virat Kohli: బీసీసీఐ సీరియస్.. కోహ్లీ, రవిశాస్త్రి జవాబు చెప్పాల్సిందే!

  • వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ కు ఓటమి
  • వరల్డ్ కప్ కోసం కోహ్లీ, శాస్త్రిలకు స్వేచ్ఛనిచ్చిన బోర్డు
  • కివీస్ చేతిలో ఓటమితో బీసీసీఐ అసంతృప్తి

ఇప్పటివరకు టీమిండియాలో విరాట్ కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాటగా సాగిందనడంలో ఎలాంటి సందేహంలేదు. టీమిండియాకు చెందిన ప్రతి నిర్ణయంలోనూ కోహ్లీ ప్రమేయం ఉంది.  జట్టు ఎంపికలో కోహ్లీ అభిప్రాయానికే సెలక్టర్లు విలువ ఇచ్చేవాళ్లన్నది బహిరంగ రహస్యం. అయితే ఇది నిన్నటివరకే. ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ఓటమి అనంతరం జట్టులోని లోపాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. వ్యూహాత్మక తప్పిదాలతో పాటు, జట్టు ఎంపిక కూడా అసంబద్ధంగా ఉందని బీసీసీఐ పాలకవర్గం భావిస్తోంది.

ఇప్పటివరకు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ పెద్దగా స్పందించలేదు. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరికీ స్వేచ్ఛనిచ్చింది. కానీ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వంటి జట్టు చేతిలో ఓటమి బీసీసీఐని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. కోహ్లీ, రవిశాస్త్రిల నిర్ణయాలను ఇప్పటికీ ప్రశ్నించకుండా ఉంటే అది సరైన విధానం అనిపించుకోదని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, వారిద్దరినీ వివరణ కోరుతూ మూడు ప్రశ్నలతో ఓ నివేదికను కోరనుంది.

1. అంబటి రాయుడ్ని ఎందుకు ఎంపిక చేయలేదు? 2. సెమీఫైనల్ మ్యాచ్ లో ధోనీని ఏడో స్థానంలో ఎందుకు దింపారు? 3. జట్టులో నలుగురు వికెట్ కీపర్లు (కేఎల్ రాహుల్, ధోనీ, పంత్, దినేశ్ కార్తీక్) ఉండాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు సంధించి వారి నుంచి కచ్చితంగా సమాధానాలు రాబట్టాలని బోర్డు పాలకులు నిర్ణయించినట్టు సమాచారం. ఇంగ్లాండ్ నుంచి జూలై 14న టీమిండియా భారత్ రానుంది. ఆ తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలను ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి పిలిపించే అవకాశాలున్నాయి.

More Telugu News