Buggana: ఆరోగ్యశ్రీ పథకానికి, రామాయణంలో సంజీవని మొక్కకు పోలిక పెట్టిన బుగ్గన!

  • ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి
  • సంజీవని మొక్క తరహాలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారన్న బుగ్గన
  • బెంగళూరు, చెన్నై ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి!

ఏపీ శాసనసభలో ఇవాళ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆరోగ్యశ్రీ పథకం గురించి చెబుతూ అలనాటి రామాయణ గాథలోని సంజీవని మొక్కతో పోలిక పెట్టారు. నాడు ఇంద్రజిత్తు సంధించిన అస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోగా, హనుమంతుడు ఏకంగా సంజీవని పర్వతాన్నే తెచ్చాడని, అదే రీతిలో పేదల ఆరోగ్యం కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని బుగ్గన వ్యాఖ్యానించారు. పేద ప్రజలు సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందుకోవాలన్న ఆశయంతోనే వైఎస్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టగా, ఇప్పుడు తాము దాన్ని మరింతగా విస్తరిస్తున్నామని చెప్పారు.

బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఉన్న ఆసుపత్రులను కూడా ఆర్యోగశ్రీ సేవల జాబితాలో చేర్చుతామని, అవసరమైన వారు ఆ నగరాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకోవచ్చని బుగ్గన వివరించారు. దీనికోసం రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, ఆరోగ్యశ్రీ పథకం తాజా అర్హత వివరాల గురించి చెబుతూ, వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబం ఆర్యోగశ్రీకి అర్హత పొందుతుందని వెల్లడించారు. ఆసుపత్రి ఖర్చులు రూ.1000, అంతకు మించిన పరిస్థితుల్లో చికిత్సకయ్యే వ్యయంపై పరిమితి లేకుండా వైద్యసేవలు అందిస్తామని వివరించారు.

More Telugu News