Andhra Pradesh: నిన్నటి చర్చను పొడిగిద్దాం... ప్రజలు చూస్తారు... అసెంబ్లీలో టీడీపీకి వైఎస్ జగన్ పంచ్!

  • సున్నా వడ్డీపై వదిలిపెట్టని తెలుగుదేశం
  • చర్చను కొనసాగించేందుకు అంగీకరించని స్పీకర్
  • తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన జగన్
  • సభా సంప్రదాయాలకు విరుద్ధమంటూ అంగీకరించని స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభంలోనే ఆసక్తికర పరిణామం జరిగింది. నిన్న రైతులకు సున్నా వడ్డీపై జరిగిన వాడివేడి చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానంతో సభ ముగియగా, ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, అదే చర్చను కొనసాగించాలని, తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు.

ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి అనుమతించేది లేదని, పైగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి వుందని, మరో రూపంలో నోటీసులు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. వారు నినాదాలు చేస్తున్న వేళ, సభా నాయకుడు, సీఎం వైఎస్ జగన్ మైక్ ను తీసుకుని, నిన్నటి చర్చను పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబునాయుడు ఏం చెప్పదలచుకున్నారో చెప్పవచ్చని అన్నారు. తమ వద్ద అన్ని గణాంకాలూ సిద్ధంగా ఉన్నాయని, సభలో మరికాసేపు అదే అంశంపై చర్చ జరిగితే ప్రజలు కూడా చూస్తారని అంటూ టీడీపీకి చురకలు అంటించారు.

కాగా, ఇలా ముగిసిన అంశాన్ని తిరిగి తోడటం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ముఖ్యమంత్రి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, అందుకు మరోసారి సమయం ఇస్తానని స్పీకర్ తేల్చి చెప్పారు.

More Telugu News