Pakistan: పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం... రైల్వే తీరుపై ఇమ్రాన్ ఆగ్రహం

  • గూడ్సును ఢీకొన్న అక్బర్ ఎక్స్ ప్రెస్
  • క్వెట్టా నుంచి లాహోర్ వెళ్తుండగా ప్రమాదం
  • కాలం చెల్లిపోయిన రైల్వే వ్యవస్థ అని మండిపడ్డ ఇమ్రాన్

పాకిస్థాన్ లో ఈరోజు ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్సును అక్బర్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్వెట్టా నుంచి లాహోర్ కు బయల్దేరిన అక్బర్ ఎక్స్ ప్రెస్ పంజాబ్ ప్రావిన్స్ లోని రహీంయార్ ఖాన్ జిల్లా సాదికాబాద్ ప్రాంతంలో గూడ్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాలం చెల్లిపోయిన రైల్వే వ్యవస్థపై మండిపడ్డారు. రైల్వే వ్యవస్థ ఇంకా పాత యుగంలోనే ఉందని విమర్శించారు. బ్రిటీష్ కాలం నాటివి ఇప్పటికీ వాడుతున్నారని... సరైన నిధులను కేటాయించకపోవడం, మెయింటెనెన్స్ చాలా దారుణంగా ఉండటం ప్రమాదాలకు కారణమవుతోందని అన్నారు. దశాబ్దాలుగా ఆధునికీకరణకు దూరంగా ఉన్న రైల్వే వ్యవస్థను మార్చడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని రైల్వే మంత్రిని ఆదేశించారు.

మరోవైపు, ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ క్షమాపణలు చెప్పారు. విచారణకు ఆదేశించామని, రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తవుతుందని తెలిపారు.

More Telugu News