airport: విమానంలో బ్యాగేజీ చార్జి కట్టాల్సి వస్తుందని కొత్త ఐడియా వేసిన ప్రయాణికుడు!

  • బ్యాగులో షర్ట్‌లన్నీ తీసి తొడుక్కున్నాడు
  • ఒకదానిపై మరొకటి...ఏకంగా పదిహేను ధరించాడు
  • నవ్వులు పూయించిన ప్రయాణికుడి చేష్టలు

అసలే ఖరీదైన విమాన ప్రయాణం. పైగా బ్యాగేజీ ఉంది. దానికి అదనపు చార్జి ఎందుకు చెల్లించాలనుకున్నాడు స్కాట్లాండ్‌ వ్యక్తి ఒకరు. బ్యాగులో లగేజీ ఉంటే చార్జి చెల్లించాలి. అదే ఒంటిపై ఎంత బరువున్నా ఫ్రీ...ఫ్రీ...ఫ్రీ కదా. ఈ టెక్నిక్‌నే ఉపయోగించి నవ్వులు పూయించాడీ ప్రయాణికుడు.

వివరాల్లోకి వెళితే...స్కాట్లాండ్‌కు చెందిన జాన్‌ ఇర్విన్‌ విమాన ప్రయాణం కోసం ఫ్రాన్స్‌లోని నైస్‌ విమానాశ్రయానికి వచ్చాడు. అతని బ్యాగులో ఎనిమిది కేజీల బరువున్న షర్ట్‌లు ఉన్నాయి. బ్యాగేజీ కోసం 96 పౌండ్లు చార్జి చెల్లించాలని అక్కడి సిబ్బంది తెలిపారు. అంతే.. జాన్‌ ఇర్విన్‌ తన మెదడుకు పదును పెట్టాడు. తెలివిగా బ్యాగులో షర్ట్‌లు తీసి ఒకదానిపై మరొకటి తొడుక్కున్నాడు. ఈ విధంగా ఎనిమిది కేజీల బరువున్న 15 షర్ట్‌లు ధరించాడు. ఆ తర్వాత ఎంచక్కా బయలుదేరాడు.

అయితే ఈయన వాలకం చూసిన భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. ఒంటిపై అంత దళసరిలో దుస్తులు ఉండడంతో లోపల ఏదైనా దాచిపెట్టాడేమో అన్న అనుమానంతో వాటిని ఒక్కొక్కటీ విప్పించి మరీ చెక్‌ చేశారు. లోపల ఏం లేదని, కేవలం లగేజీ డబ్బు మిగుల్చుకునేందుకు అతను అలా చేశాడని తెలుసుకుని వారు కూడా నవ్వుకున్నారట. జాన్‌ ఇర్విన్‌ చేసిన ఈ పనిని అతని కొడుకు జోష్‌ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.

More Telugu News