Nara Lokesh: ఆర్థికమంత్రిగారూ.. శ్వేతపత్రాలు సాక్షి పత్రిక కథనాల్లానే ఉన్నాయి: లోకేశ్ ఎద్దేవా

  • అభివృద్ధిని అంగీకరించినందుకు ధన్యవాదాలు
  • ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇచ్చేశారు
  • ఇప్పుడు రుణాలు పెంచి చూపించి తప్పించుకోవడం కుదరదు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. శ్వేతపత్రాలు కూడా సాక్షి పత్రిక కథనాల్లాగానే స్పష్టత లేకుండా, ఆధారాలు లేకుండా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అవి ముందు ఊహించినట్టుగానే ఉన్నాయన్నారు. మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. వృద్ధి కాగితాల మీదే తప్ప ఫీల్డులో కనిపించడం లేదని అన్నారని, అంటే మీ శ్వేత పత్రంలో ఉంది కానీ, మీరు ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదన్న విషయం అర్థమవుతోందని చురుకలంటించారు.
 
మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని అంగీకరించినందుకు కృతజ్ఞతలని లోకేశ్ అన్నారు. వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపి జీఎస్ డీపీని లెక్కించడం దేశమంతా ఉన్న పాత విషయమేనని, కానీ మీకది కొత్తగా ఉందని విమర్శించారు. 2018-19 బడ్జెట్‌ ప్రకారం రాష్ట్ర రుణం రూ.2.49 లక్షల కోట్లు అని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించారని, మీరేమో రూ.3.62 లక్షల కోట్లు అని అంటున్నారని, ఒకేసారి ఇంత మొత్తం ఎలా పెరిగిందని నిలదీశారు. అప్పు ఎక్కువ చూపించి మీరేం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఎడాపెడా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు అప్పులను ఎక్కువగా చూపించి తప్పించుకోవాలని చూస్తే కుదరదన్నారు. చేతకాకపోతే ప్రజల ముందు ఆ విషయాన్ని ఒప్పేసుకోవాలని లోకేశ్ సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News