assam: అస్సాంలో నదిలో మునిగిపోతున్న తల్లీబిడ్డలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు!

  • అస్సాంలోని మిస్సమరీ ప్రాంతంలో ఘటన
  • ఈ నెల 7న నదిలో చిక్కుకున్న ఓ మహిళ, పిల్లాడు
  • సాహస బాలుడిపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రశంసలు

అస్సాంకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు తన వయసుకు మించిన ధైర్యాన్ని ప్రదర్శించాడు. నదిలో మునిగిపోతున్న ఓ మహిళను, ఆమె కుమారుడిని కాపాడాడు. దీంతో అస్సాం ముఖ్యమంత్రి సహా పలువురు ఈ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అస్సాంలోని మిస్సమరీ ప్రాంతానికి చెందిన ఉత్తమ్ తాటి(11) ఈ నెల 7న ఊరికి సమీపంలోని నది దగ్గర ఆడుకుంటున్నాడు. అప్పుడే ఓ మహిళ తన పిల్లాడితో కలిసి ఆ నదిని దాటేందుకు ప్రయత్నించింది. అయితే నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో మునిగిపోవడం ప్రారంభించింది.

దీన్ని గమనించిన ఉత్తమ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నదిలోకి దూకి తల్లీబిడ్డలను ఒడ్డుకు చేర్చాడు. అనంతరం ఊర్లోవారికి సమాచారం అందించాడు. దీంతో సమయస్ఫూర్తితో ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఉత్తమ్ తాటిపై గ్రామస్తులు, అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ట్విట్టర్ లో ప్రస్తావించారు. ఈ బాలుడు చేసిన సాహసాన్ని పొగడటానికి మాటలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు. అతని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు అన్నారు.

More Telugu News