Chandrababu: చరిత్ర తిరగరాసే బిల్లులను సభలో ప్రవేశపెడతాం: ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • ముగిసిన బీఏసీ సమావేశం
  • గతానికి భిన్నంగా అసెంబ్లీ నిర్వహిస్తాం
  • చంద్రబాబు హాజరుకాకపోవడం దురదృష్టకరం

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గతానికి భిన్నంగా అసెంబ్లీ నిర్వహిస్తామని, చరిత్ర తిరగరాసే బిల్లులను సభలో ప్రవేశపెడతామని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాసమస్యలపై చంద్రబాబుకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం అద్దంపడుతుందని వ్యాఖ్యానించారు. ఏ అంశంపై అయినా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పారు.

రేపటి నుంచి ఈ నెల 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు. ఈ నెల 12న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News