Polavaram: పోలవరానికి రీ టెండర్... ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందం రద్దు?

  • 2013లో కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్
  • ఆపై నవయుగ సంస్థకు పనుల అప్పగింత
  • అవినీతిపై నిపుణుల కమిటీని నియమించిన కొత్త ప్రభుత్వం
  • నేడు నివేదిక సమర్పణ

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా వెళుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులను చేస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్తగా మరోసారి టెండర్లను పిలవాలని ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాన కాంట్రాక్టర్ తో కాంట్రాక్టు రద్దయితే, సబ్ కాంట్రాక్టులు కూడా రద్దయి పోతాయని, అందువల్ల అన్ని పనులకూ టెండర్లు పిలవాలని అధికారులు తమ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రధాన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అంచనాల పెంపు, అవకతవకలపై విచారించి నివేదిక ఇవ్వాలంటూ విశ్రాంత ఇంజినీర్లతో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

వీరు తొలుత పోలవరంపై అధ్యయనం చేసి, అన్ని రికార్డులనూ పరిశీలించారు. ఆపై ప్రాజెక్ట్ ఇంజినీరు ఇన్‌-చీఫ్‌ వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌ తదితరులను ప్రశ్నించి, కొన్ని సిఫార్సులు చేస్తూ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. సీల్డ్‌ కవర్ లో ఈ రిపోర్టు నేడు జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందనుంది.

వాస్తవానికి పోలవరం పనులను 2013లో ట్రాన్స్‌ ట్రాయ్‌ దక్కించుకుంది. అంచనా విలువపై 14 శాతం తక్కువ కోట్ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌ అండ్‌ టీ, బావర్‌, త్రివేణి, కెల్లర్‌, బెకం తదితర సంస్థలు సబ్ కాంట్రాక్టర్లుగా చేరాయి. ఆపై ప్రాజెక్టు పనుల విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం తదితర పనులను ట్రాన్స్‌ ట్రాయ్‌ నుంచి తొలగించి నవయుగ సంస్థకు అప్పగించారు. మరోపక్క, ట్రాన్స్‌ ట్రాయ్‌ దివాలా తీసింది. దీంతో ప్రాజెక్టు పనులను పలు సంస్థలకు అప్పగించారు. ప్రధాన కాంట్రాక్టర్ లేకుండా పనులను ఎలా కొనసాగిస్తారని జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం.

More Telugu News