Ongole: అమ్మాయి బస్సులో వెళుతుంటే బైక్ పై వెంబడించిన యువకులు... ఒంగోలు - చీమకుర్తి మధ్య హైడ్రామా!

  • ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చిన యువతి
  • ఇద్దరు వేధిస్తుంటే వారిని పంపేసి బస్సెక్కించిన పోలీసులు
  • బైక్ పై అమ్మాయి బస్సు వెంట పడిన పోకిరీలు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

ఒంగోలు బస్టాండ్ ఔట్ పోస్ట్ పోలీసుల చొరవ ఓ యువతిని కాపాడింది. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువతి, ఇంటికి వెళ్లేందుకు వచ్చిన వేళ, అర్థరాత్రి ఆమెను వేధించిన ఇద్దరు యువకులు, ఆపై ఆమె బస్సులో వెళుతున్నా వెంబడించారు. హైడ్రామా మధ్య ఆపై పోలీసులకు చిక్కారు.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్న ఓ యువతి, చీమకుర్తిలోని తన ఇంటికి వెళ్లేందుకు అర్ధరాత్రి తరువాత ఒంగోలు బస్టాండుకు చేరుకుంది. బస్ కోసం ఆమె వేచి చూస్తుండగా, ఇద్దరు యువకులు ఆమెను కామెంట్ చేస్తుండటాన్ని అవుట్‌ పోస్ట్ పోలీసులు చూశారు. వారిని హెచ్చరించి పంపి, యువతి వివరాలను ఆరా తీశారు. తాను చీమకుర్తి వెళ్లాలని చెప్పడంతో, కనిగిరి బస్సు రెడీగా ఉందని చెప్పి, బస్సు ఎక్కించారు.

ఆమె బస్సు ఎక్కగానే, ఆ ఇద్దరు యువకులు తమ బైక్ పై బస్సును వెంబడించారు. బస్ లో కూర్చున్న యువతి వీరిని గమనించింది. చీమకుర్తిలో దిగగానే, తన ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి ఎలా చేరాలో తెలియని స్థితిలో, అక్కడే ఉన్న ఓ ఆటో ఎక్కి, తిరిగి ఒంగోలు చేరుకుంది. మరోసారి బస్టాండ్ కు వచ్చిన ఆమెను చూసిన పోలీసులు విషయం అడిగారు. ఆమె జరిగింది చెప్పగానే అప్రమత్తం అయ్యారు.

ఆ ఇద్దరు యువకులు తిరిగి ఆమెను వెంబడిస్తూ, బస్టాండ్ కు రాగానే అదుపులోకి తీసుకున్నారు. తాము ఆమెను వెంబడించినట్టు అంగీకరించగానే, కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన జయబాబు, మరొకరు లింగసముద్రం మండలానికి చెందిన రమేష్‌ గా గుర్తించారు. ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నామని, అమ్మాయిలు ఆపదలో ఉంటే డయల్ 100ను వినియోగించుకోవాలని, ఈ విషయంలో అవగాహన రాహిత్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News