Andhra Pradesh: చంద్రబాబు కష్టపడి పార్కును కడితే.. వైఎస్ పేరును పెడతారా?: విశాఖలో టీడీపీ శ్రేణుల ఆందోళన

  • సెంట్రల్ పార్కుకు వైఎస్సార్ పార్కుగా నామకరణం
  • కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించిన నేతలు
  • పేరు మార్చేవరకూ ఉద్యమిస్తామని హెచ్చరిక

విశాఖపట్నం సౌత్ లో ఉన్న సెంట్రల్ పార్కు పేరును వైఎస్సార్ పార్కుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగడాలు తీసుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉండగా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కష్టపడి ఈ పార్కును నిర్మించారని టీడీపీ నేతలు తెలిపారు.

అలాంటిది చంద్రబాబు కట్టిన పార్కుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎలా పెడతారని నిలదీశారు? సెంట్రల్ పార్కుకు వైఎస్ పేరు కొనసాగిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకునేవరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. విశాఖలో సెంట్రల్ పార్కు పేరును వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్కుగా మార్చారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ కొత్తపేరుతో ఉన్న శిలాఫలకాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ వర్ధంతి నాటికి పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు.

More Telugu News