Andhra Pradesh: మోదీతో పెట్టుకోవద్దని చంద్రబాబుకు పెద్దలతో చెప్పించా.. వినలేదు: అంబికా కృష్ణ

  • ప్రజల్లో లోకేశ్ కు అనుకున్నంత ఆదరణ రాలేదు
  • నా మాటను చంద్రబాబు వినిపించుకోలేదు
  • బాలకృష్ణకు చెప్పాకే టీడీపీకి రాజీనామా చేశా

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని బీజేపీ నేత అంబికా కృష్ణ తెలిపారు. నిజంగా అంత ఆదరణ ఉండి ఉంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచిఉండేవాడని వ్యాఖ్యానించారు. అసలు మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి, లోకేశ్ కు అపప్రధేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారో సులభంగా అర్థం అయిపోతుందని అన్నారు. ఇప్పుడు ఓ రాజకీయ పార్టీగా టీడీపీ నిలదొక్కుకోవడం చాలా కష్టమని అంబికా కృష్ణ చెప్పారు. ‘నేను చంద్రబాబుకు చెప్పాను. పెద్దవాళ్లతో కూడా చెప్పించాను. సార్.. మనకు మోదీతో గొడవవద్దు. మనకు కావాల్సింది మళ్లీ అధికారంలోకి రావడం అని చెప్పా. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు’ అని తెలిపారు.

చివరికి 303 లోక్ సభ సీట్లతో మోదీ ప్రభుత్వం ఏర్పడిందని అంబికా కృష్ణ అన్నారు. 20 ఏళ్ల పాటు టీడీపీ కోసం పనిచేసిన తాను బీజేపీలోకి వెళ్లిపోతానని చంద్రబాబు అస్సలు ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. పార్టీ మారేముందు విషయాన్ని బాలకృష్ణకు ముందే చెప్పానన్నారు. అయితే ఈ విషయమై చంద్రబాబుతో మాత్రం చర్చించలేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాననీ, భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీలో ఎంత బాగా పనిచేసినా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.

More Telugu News