Andhra Pradesh: మందుబాబులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత్వం?

  • మద్యం అమ్మకాల సమయాన్ని కుదించే యోచనలో ప్రభుత్వం
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు
  • మద్యం అమ్మకాలు భారీగా తగ్గుతాయనేది ప్రభుత్వ ఆలోచన

ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీలోని జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ సమయాన్ని కుదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని భావిస్తోంది. దీని వల్ల 4 గంటల మేర మద్యం అమ్మకాలు తగ్గుతాయి. దీంతో, సాధారణ అమ్మకాలతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గుతాయనేది ప్రభుత్వ భావన.

వాస్తవానికి సాయంత్రం 6 గంటల తర్వాతే మద్యం అమ్మకాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఎవరైనా సరే... రాత్రి వేళల్లోనే ఎక్కువగా మద్యం తాగుతారు. రాత్రి పూట మద్యం షాపులు కిక్కిరిసిపోతాయి. దీంతో, 6 గంటలకు మద్యం షాపులను బంద్ చేస్తే... మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబరు నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, పలు ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే... మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చినట్టే.

More Telugu News